1646లో నీటిపాలబడి, 2017లో బయటపడిన అపార సంపద: చైనా పంట పండిందా?

మంగళవారం, 21 మార్చి 2017 (07:30 IST)
దాదాపు 300 సంవత్సరాల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10వేలకు పైగా వెండి, బంగారు వస్తువులున్నాయని చెప్పారు. నైరుతి చైనాలోని సిచువాన్‌ ప్రావియెన్స్‌ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించామన్నారు. ఇందులో ఎక్కువగా నాణేలు, నగలు ఉన్నాయని, వీటితోపాటు కంచు, ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పారు. మిన్‌జియాంగ్‌ నదికి ఉపనదిగా పిలిచే జిన్‌జియాంగ్‌ నది గర్భంలో ఈ సంపద బయటపడిందని సిచువాన్‌ ప్రావిన్షియల్‌ కల్చరల్‌ రెలిక్స్‌ అండ్‌ అర్కియాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ గావో డాలన్‌ తెలిపారు.
 
1646లో ఈ ప్రాంతాన్ని పాలించిన ఝాంగ్‌ జియాంఝాంగ్‌... మింగ్‌ సైన్యానికి భయపడి సంపదను వెయ్యి పడవల్లో మరోచోటుకు తరలిస్తుండగా అందులో కొన్ని పడవలు నీటిలో మునిగిపోయాయని, ఆ సంపదే ఇప్పుడు బయట పడిందన్నారు. సాధారణంగా వేసవి సమీపించడంతో నదీ పరిసర ప్రాంతాల్లో పురాతత్వశాస్త్రవేత్తలు తవ్వకాలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది కూడా తవ్వకాలు మొదలు పెట్టడడంతో ఈ నిధి బయటపడింది.
 

వెబ్దునియా పై చదవండి