తిమింగలం పొట్టలో 1000 రకాల కప్పులు.. ఆరు కేజీల ప్లాస్టిక్...

గురువారం, 22 నవంబరు 2018 (11:16 IST)
ప్లాస్టిక్ కేవలం పర్యావరణంతో పాటు మానవాళికే కాదు సముద్రగర్భంలో ఉన్న జీవరాశులకు సైతం హాని కలిగిస్తోంది. సముద్రంలో సంచరించే తిమింగలం పొట్టలో ఏకంగా 5.9 కేజీల ప్లాస్టిక్ ఉండటమే ఇందుకు నిదర్శనం. 
 
ఇండోనేసియాలోని వకాటోబి నేషనల్ పార్కులోకి 9.5 మీటర్లున్న భారీ తిమింగలం ఒకటి ఇటీవలి కొట్టుకొచ్చింది. చనిపోయిన ఆ తిమింగలం కళేబరాన్ని తొలగించే చర్యలు పార్కు అధికారులు చేపట్టారు. 
 
అయితే, అది పూర్తిగా కుళ్లిపోయివుంది. దీంతో దాన్ని తొలగించేటపుడు శరీరమంతా ముక్కలు ముక్కలుగా విడిపోయింది. పొట్టలో నుంచి ప్లాస్టిక్ బయటపడింది. ఇందులో 115 ప్లాస్టిక్‌‌‌‌‌‌‌ కప్పులు, 4 ప్లాస్టిక్ బాటిళ్లు, 25 ప్లాస్టిక్ బ్యాగులు, 2 ఫ్లిప్‌ఫాప్‌లు, ఓ నైలాన్‌ బ్యాగుతోపాటు 1,000 రకాల ప్లాస్టిక్ ముక్కలు కలిపి దాదాపుగా ఆరు కేజీల వరకు ప్లాస్టిక్ బయటపడింది. ఆ ప్లాస్టిక్‌ను చూసిన పార్కు అధికారులు ఆశ్చర్యపోయారు. 
 
తిమింగలం శరీరం బాగా కుళ్లిపోయి ఉన్నందున ప్లాస్టిక్ వల్లే చనిపోయిందని ఖచ్చితంగా చెప్పలేమని చెబుతున్నారు. తిమింగలం ఫొటోలు పర్యావరణ ప్రేమికులనేకాకుండా యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. 
 
సో.. మనిషి తన అవసరాల కోసం తయారు చేసిన ప్లాస్టిక్ వల్ల జీవజాతికి ఎంతలా నష్టం జరుగుతోందో, ఎలా ప్రాణాలను హరిస్తోందో ఈ ఘటన తెలియజేస్తోంది. ముఖ్యంగా, సముద్రంలో ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంతలా విస్తరించిందో, దాని దెబ్బకు సముద్ర జీవులు ఎలా రాలిపోతున్నాయో ఈ తిమింగలం కళ్ళకు కట్టింది. 
 
కాగా, ఇండోనేషియాలో ఉన్న వకాటోబి పార్క్  వైవిధ్య జీవ జాలానికి నెలవు. బందా, ఫ్లోర్స్ సముద్రాల మధ్య ఉన్న ఈ మెరైన్‌ పార్కు సుమారు 942 రకాల చేప జాతులు, 750 రకాల పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. అందుకే 2005 నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి సిఫార్సులు కూడా చేయడం జరిగింది. 
 
26 కోట్ల మంది జనాభా ఉన్న ఇండోనేసియా ప్రపంచంలో అత్యంత ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలుష్య ప్రాంతాల్లో చైనా తర్వాత రెండోది. యేడాదికి 32 లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 12 లక్షల టన్నులు సముద్రంలోనే కలుస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీని నిషేధించాలని ఆ దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు