పెళ్లి వేడుకలో భారీ పేలుడు : 63 మంది దుర్మరణం

ఆదివారం, 18 ఆగస్టు 2019 (11:52 IST)
అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ పెళ్లి వేడుకను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ పేలుడులో 63 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మంది దాకా గాయపడ్డారు. రిసెప్షన్‌కు వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకుని ఈ మారణహోమానికి పాల్పడ్డాడు. 
 
ఈ సంఘటన కాబూల్‌కు పశ్చిమాన ఉన్న షహర్ - ఏ - దుబాయి వెడ్డింగ్ హాల్‌లో జరిగింది. శనివారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 10.40 గంటలకు ఈ సంఘటన జరిగిందని అప్ఘనిస్తాన్ హోంశాఖ తెలిపింది. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదు. పెళ్లి వేడుకలో దాదాపు 1,200 మంది ఉన్నట్లు వరుడి బంధువు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. 
 
వివాహం జరిగిన భవనం రెండంతస్థుల భవనం. సంఘటన జరిగిన సమయంలో వెడ్డింగ్ హాల్ కిక్కిరిసి ఉందని చెబుతున్నారు. ఆదివారం ఉదయం అంబులెన్స్‌ల ద్వారా బాధితులను తరలించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశాయి. కాబూల్‌లో దాదాపు 5 మిలియన్ల మంది నివసిస్తున్నారు. తరుచుగా నగరంలో పేలుళ్లు సంభవించడం గత రెండేళ్లుగా ఆనవాయితీ అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు