చెత్త బ్యాటింగ్ ... కేదార్ - ధోనీ భాగస్యామ్యం నచ్చలేదు : సచిన్

ఆదివారం, 23 జూన్ 2019 (16:55 IST)
ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా శనివారం భారత్ - ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్‌పై అష్టకష్టాలు పడి గెలిచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ... ఆప్ఘాన్ ఆటగాళ్లు ప్రదర్శించిన ఆటతీరుకు నలువైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
 
ఆప్ఘాన్ స్పిన్నర్ల ధాటికి భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 రన్స్ చేసింది. ఆ తర్వాత మహ్మద్ నబీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. భారత్‌ను హడలెత్తించాడు. చివరి ఓవర్‌లో విజయానికి కేవలం 16 పరుగులే కావాల్సి ఉండగా.. మహ్మద్ షమీ హ్యాట్రిక్ సాధించడంతో విజయం భారత్‌ను వరించింది. లేని పక్షంలో భారత్‌‌కు పరాజయం తప్పేది కాదు.
 
ఈ మ్యాచ్‌లో భారత ఆటతీరుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్‌పై ఆయన మండిపడ్డారు. వీరిద్దరు కాస్త వేగంగా బ్యాటింగ్ చేస్తే.. భారత్ అంత స్వల్పస్కోర్‌కి పరిమితం అయ్యేది కాదన్నారు. 
 
"నేను కాస్త నిరాశ చెందాను. ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. కేదార్, ధోనీల భాగస్వామ్యం నాకు నచ్చలేదు. స్పిన్ బౌలింగ్‌లో 34 ఓవర్లు ఆడి కేవలం 119 పరుగులే చేశాం. ఇది చాలా అసౌకర్యంగా ఉంది. విరాట్ 38వ ఓవర్‌లో అవుటైన తర్వాత 45వ ఓవర్ వరకు పరుగులు చేయలేదు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు ప్రత్యర్థులను ఒత్తిడిలో పెట్టలేకపోయారు. అనుకున్నంత స్ట్రైక్‌రేటుతో ధోనీ, కేదార్ బ్యాటింగ్ చేయలేదు. ఆ ఓవర్లలో ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. కేదార్ కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు అనిపించింది' అని సచిన్ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు