మంచు గడ్డలపై యోగా - బ్రీతింగ్ వ్యాయామాలు చేసిన భారత అధికారి సిద్ధార్థ

వరుణ్

బుధవారం, 17 ఏప్రియల్ 2024 (09:32 IST)
ఐక్యరాజ్య సమితిలో భారత అధికారిగా ఉన్న సిద్ధార్థ ఛటర్జీ చేసిన పనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చైనాలో ఐక్యరాజ్య సమితికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాలోని ఓ సరస్సుని నీరు పూర్తిగా గడ్డకట్టుకునిపోయింది. బీజింగ్‌లో గడ్డకట్టిన సబ్ జీరో ఉష్ణోగ్రతలో మంచు గడ్డలపై కూర్చొని ఆయన యోగా చేశారు. బ్రీతింగ్ వ్యాయామాలు చేశారు. యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజుల ప్రాముఖ్యతను వివరించేందుకు వీలుగా ఆయన యోగా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు చైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా, శ్వాస వ్యాయామాలు ఎంత మేలు చేస్తాయో అవగాహన కల్పించేందుకు ఆయన తన ఈ వ్యాయామాలకు సంబంధించిన డాక్యుమెంటరీ వీడియోను విడుదల చేశారు. చటర్జీ ప్రస్తుతం చైనాలో యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా సేవలందిస్తున్నారు. బీజింగ్‌లోని ఓ గడ్డకట్టిన సరస్సుపై ఆయన అర్ధనగ్నంగా యోగా చేశారు. శీర్షాసనం, బ్రీతింగ్ వ్యాయామాలు చేశారు. 'భూమ్మీద పడ్డాక శిశువు చేసే తొలి పని శ్వాశించడమే' అంటూ ఆయన ప్రాణాయామానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు.
 
కాగా, 2020లో ఆయన చైనాలో ఐక్యారాజ్య సమితి బాధ్యతలు చేపట్టారు. చైనా - భారత్ దౌత్య ఉద్రిక్తతలు పతాకస్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఇక యూఎస్ బాధ్యతలు చేపట్టేనాటికి 60 ఏళ్లకు చేరుకున్న ఆయన ఊబకాయం, హైకొలెస్టెరాల్, బీపీ, ప్రీ డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కానీ బ్రీతింగ్ వ్యాయామాలు, ఇతర కసరత్తులతో ఏకంగా 25 కిలోలు తగ్గి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు.
 
బంగ్లాదేశ్‌కు చెందిన చటర్జీ స్వాంతంత్ర్య పోరాట సమయంలో కుటుంబంతో సహా కోలకతాకు వచ్చేశారు. ఆ తరువాత పోలియో బారిన పడి అదృష్టవశాత్తూ కోలుకున్నారు. ఈ మహమ్మారిని కోరల నుంచి బయటపడ్డ అతికొద్ది మంది అదృష్టవంతుల్లో తానూ ఒకడినని ఆయన తెలిపారు. చిన్నప్పుడు తన కాళ్లను క్రియాశీలకం చేసేందుకు వైద్యులు ఇచ్చిన విద్యుత్ షాకులు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పుకొచ్చారు.
 
1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన అనంతరం తన జీవితం మలుపు తిరిగిందని ఛటర్జీ తెలిపారు. పారా రెజిమెంట్లో పనిచేసిన ఆయన ఆ తరువాత అమెరికాలోని ప్రముఖ ప్రిన్స్ టన్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఐక్యరాజ్యసమితి పీస్ కీపింగ్ మిషన్స్‌లో భాగంగా ఆయన పలు దేశాల్లో పనిచేశారు. ఐక్యరాజ్య సమితిలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన కెన్యా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇరాక్, సోమాలియా, సౌత్ సుడాన్, సుడాన్, ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, ఇరాకీ కుర్దిస్థాన్, చైనా వంటి భిన్న దేశాల్లో సేవలందించారు. మరో వివేషమేంటంటే.. ఛటర్జీ భార్య దక్షిణ కొరియా మహిళ. ఆమె ప్రస్తుతం భారత్‌లో యూనీసెఫ్ సోషల్ పాలసీ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు