అమ్మో.. మూడేళ్ల చెడిన మాంసాన్ని ఆ రెస్టారెంట్లో వడ్డించారా.. తిని ఇద్దరి మృతి..

గురువారం, 15 నవంబరు 2018 (10:48 IST)
వీకెండ్ అయితే చాలు రెస్టారెంట్లకు వెళ్లడం ఫ్యాషనైపోయింది. కానీ వార్త చదివితే మాత్రం రెస్టారెంట్లకు వెళ్లాలంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వుంటుంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసంతో వంటలు చేశారు. ఈ వంటలను ఆరగించిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు. ఈ ఘటన పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కరాచీలోని ఆరిజోనా గ్రిల్ రెస్టారెంట్‌లో ఇటీవల కొందరు భోజనం చేశారు. వెంటనే వారంతా అస్వస్థతకు లోనుకాగా, కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన ఇద్దరు భుజించిన మాంసం మూడేళ్ల క్రితం నాటిదని అధికారులు గుర్తించారు. 
 
కుళ్లిపోయిన మాంసాన్ని రెస్టారెంట్ నిర్వాహకులు వేడిచేసి మరీ వినియోగదారులకు వడ్డిస్తున్నారని తేలింది. దీంతో బరిలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 80 కిలోల చెడిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2015 సమయంలో ఈ ప్యాకేజ్డ్ మాంసాన్ని రెస్టారెంట్ యజమానులు కొనుగోలు చేశారని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. హోటల్‌ను సీజ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు