షరీఫ్‌కు ట్రంప్ ఫోన్.. భారత్-పాక్ సంబంధాలకు గండి.. దౌత్య సంప్రదాయాలను చెడగొట్టేలా?

శనివారం, 3 డిశెంబరు 2016 (14:43 IST)
అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేయడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌ సమస్యల పరిష్కారానికి ముందుంటానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇవ్వడంపై భారత్‌తో పాటు చైనా కూడా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో షరీఫ్‌కు ట్రంప్ కాల్ చేయడం వల్ల భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. 
 
విదేశీ నేతలకు ఫోన్లు చేసేముందు కొన్ని దశాబ్దాలుగా ఉన్న దౌత్య సంప్రదాయాలను చెడగొట్టేలా ఉండకూడదని టైమ్స్ పత్రిక తెలిపింది. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. పాక్ ప్రధానికి ఫోన్ చేయడం, ఆ దేశ సమస్యల పరిష్కారానికి కావల్సిన ఏ పాత్రనైనా తాను పోషిస్తానని చెప్పడం వల్ల భారత్ - పాక్ సంబంధాలకు గండిపడే అవకాశం ఉన్నట్లు సదరు పత్రిక ఊటంకించింది. అలాగే చైనాతో ఉన్న సంబంధాలు కూడా దెబ్బతినేలా తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్ వెన్‌తో ట్రంప్ మాట్లాడటంపై చైనా కూడా ఫైర్ అవుతోంది. 1979 తర్వాత.. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి లేదా అధ్యక్షుడు తైవాన్ నాయకులతో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి