కరోనాతో చస్తుంటే.. కొత్తగా హంటా వైరస్.. పుట్టుక చైనాలోనే...

మంగళవారం, 24 మార్చి 2020 (19:34 IST)
ఇప్పటికే ప్రపంచం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా, చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న ఈ వైరస్.. ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేయలేక ప్రపంచ దేశాలు చేతులెత్తేశాయి. 
 
ఈ పరిస్థితుల్లో చైనాలో మరో కొత్త వైరస్ పురుడుపోసుకుంది. దీనిపేరు హంటా వైరస్. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి వ్యాపించదు గానీ.. గాలి ద్వారా వ్యాపిస్తుంది. అయితే, ఈ వైరస్‌ను నిర్మూలించేందుకు టీకాలు ఉన్నాయి. ఇది కొంతలో కొంత ఊరటగా చెప్పుకోవచ్చు.. 
 
నిజానికి కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య చైనాలో గణనీయంగా తగ్గిపోయింది. కొత్త కేసులు కూడా పెద్దగా నమోదు కావడం లేదు. ఈ నేపథ్యంలో చైనాలోని యునాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి హంటా వైరస్ ప్రభావంతో మరణించాడు. కరోనా శాంతిస్తుందనుకుంటున్న తరుణంలో మరో వైరస్ వెలుగు చూడటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. 
 
చైనాలో ఈ వైరస్ గతంలో తీవ్ర ప్రభావం చూపింది. 1950 నుంచి 2007 మధ్య కాలంలో దీని ప్రభావంతో 15 లక్షల మంది వ్యాధిగ్రస్తులు కాగా, 46 వేల మంది ప్రాణాలు విడిచారు. అయితే ఈ హంటా వైరస్‌కు వ్యాక్సిన్ ఉండడం కాస్తలో కాస్త నయం అని చెప్పాలి. ఇది గాలి ద్వారా మాత్రమే సోకుతుంది. మనిషి నుంచి మనిషికి వ్యాపించదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు