పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఏకంగా రూ.11 వేల కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన సూరత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన అరెస్టుకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. నీరవ్ మోడీ అరెస్టుకు సహకరించాల్సిందిగా హాంకాంగ్‌ను భారత్ కోరింది. ఈ విషయాన్ని చైనా దృష్టికి హాంకాంగ్ తీసుకెళ్లగా, ఈ విషయంలో హాంకాంగ్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చంటూ స్పష్టం చేసింది.
భారత ప్రతిపాదనపై స్పందించాలంటూ వచ్చిన ప్రశ్నపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అధికారం, సహకారం మేరకు... ఒక దేశం రెండు వ్యవస్థల నిబంధనలు, హాంకాంగ్ చట్టాలను అనుసరించి న్యాయ ప్రక్రియలో ఇతర దేశాలకు హాంకాంగ్ సహకరించవచ్చుని పేర్కొన్నారు.
పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోడీ ప్రస్తుతం చైనా ప్రత్యేక పాలనా ప్రాంతం హాంకాంగ్‌లో తలదాచుకుంటున్నట్టు భారత్ గుర్తించిన సంగతి తెలిసిందే. నీరవ్ మోడీని అదుపులోకి తీసుకోవాలంటూ హాంకాంగ్‌కు భారత్ ప్రతిపాదించడం, అందుకు చైనా నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలూ లేకపోవడంతో నీరవ్ మోడీ అరెస్టు ఖాయమైనట్టేనని చెబుతున్నారు.