పాకిస్థాన్‌లో పరువు హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఇద్దరు సోదరీమణులను సోదరుడు దారుణంగా హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పంజాబ్ ప్రావిన్సుకు చెందిన కోసర్ (22), గుల్జార్ బీబీ (28)లనే ఇద్దరు సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు తెచ్చిన బంధువుల సంబంధం కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తమ మాట వినకుండా ప్రేమించి పెళ్లాడారని కోపం పెంచుకున్న సోదరుడు నసీర్ హుసేన్ (35) ఇద్దరు సోదరీమణులను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యలు పరువు కోసమే సోదరుడు చేశాడని పాక్ పోలీసులు తెలిపారు. పరువు కోసం తన కుటుంబాన్నే నాశనం చేశాడని మృతులు, నిందితుడి తండ్రి అట్టా ముహమ్మద్ చెప్పారు. పాకిస్థాన్‌లో ప్రతి ఏటా పరువు కోసమే వందలాదిమంది మహిళలు హత్యకు గురవుతున్నారని పోలీసులు వెల్లడించారు.