ఆ గ్రామవాసులు కోటీశ్వరులు. అదీ వ్యవసాయంతోనే కోటీశ్వరులయ్యారు. వ్యాపారం చేస్తేనే కోట్లు సంపాదించవచ్చుననే పద్ధతికి చెక్ పెట్టారు. చైనాలో ఉన్న హుయాక్సి అనే గ్రామంలో అందరూ కోటీశ్వరులే. ఒక్కరు కూడా పేదలు లేరు. ఆ గ్రామస్తులకు ఖరీదైన విల్లాలు, కార్లు ఉన్నాయి. కానీ వారు ఇప్పటికీ చేస్తుంది వ్యవసాయమే. పాడి పశువుల పెంపకం, వ్యవసాయం. ఇవే ఆ గ్రామ వాసులకు ఆదాయ వనరు.
హుయాక్సి గ్రామం ఉండేది చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో మాత్రమే. అయినా అక్కడ 1600 కుటుంబాలు ఉన్నాయి. వారు దశాబ్ధాల నుంచి ఎంతో సమిష్టిగా ఉంటూ అందరూ కలిసి వ్యవసాయం, పశువుల పెంపకం చేస్తూ వస్తున్నారు. ఆ గ్రామంలో ఖరీదైన కార్లతోపాటు ఎడ్ల బండ్లు, ఆవులు సర్వ సాధారణంగా కనిపిస్తాయి. ఏటా ఈ గ్రామం ఎంతో అభివృద్ధి సాధిస్తుండడంతో దానికి చుట్టు పక్కల ఎన్నో పరిశ్రమలు వెలిశాయి.
అందులో ప్రధానమైనవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలే. స్టీల్ మిల్స్, టెక్స్‌టైల్ పార్కులు కూడా ఆ గ్రామం చుట్టు పక్కల రావడంతో ఇప్పుడు అక్కడ ఎన్నో వేల మందికి ఉపాధి దొరుకుతోంది. ఆ గ్రామ వాసులందరూ పలు పరిశ్రమల్లో వాటాదారులుగా ఉన్నారు. వారికి ఏటా కొన్ని లక్షల డాలర్ల ఆదాయం కూడా వస్తోంది. ఇప్పుడు ఆ గ్రామంలోని అందరూ కోటీశ్వరులే అయినా ఇప్పటికీ వారు సేద్యం చేస్తూనే జీవనం సాగిస్తున్నారు.
55 ఏళ్లుగా వారు ప్రగతి పథంలో దూసుకెళ్తూ ఎలాంటి వివాదాలు లేకుండా జీవిస్తుండడంతో వారి గ్రామం ప్రపంచంలోనే ఆదర్శ గ్రామంగా రికార్డులకెక్కింది. దీంతో అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. హుయాక్సి గ్రామానికి వచ్చే సందర్శకుల కోసం 328 మీటర్ల ఎత్తైన 60 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇది చూసేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లా ఉంటుంది.