మా జోలికొస్తే ఏం చేస్తామో చెప్పలేం : ఇమ్రాన్ అణు హెచ్చరిక

గురువారం, 28 ఫిబ్రవరి 2019 (08:54 IST)
భారత్‌కు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నర్మగర్భంగా అణుదాడి హెచ్చరికలు చేశారు. తమ జోలికి వస్తే మేం ఏం చేస్తామో.. ఎలా స్పందిస్తామో చెప్పలేమన్నారు. ఒక వేళ్ళ యుద్ధమంటూ ప్రారంభమైతే మా, మీ చేతుల్లో ఏమీ ఉండదన్నారు. అందువల్ల కూర్చొని మాట్లాడుకుందాం రండి అంటూ భారత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నియంత్రణ రేఖ దాటి జైషే మొహ్మద్ ఉగ్ర తండాలను ధ్వంసం చేసింది. ఈ దాడులను ఏమాత్రం సహించుకోలేని పాకిస్థాన్.. ప్రతీకార చర్యకు దిగింది. భారత్‌లోని రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ప్రయత్నించింది. వీటిని భారత వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టింది. 
 
ఆయన బుధవారం ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, శాంతి వచనాలు పలుకుతూనే భారత్‌కు పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. తాను గతంలో చెప్పాను. ఇపుడూ చెబుతున్నాను. పరిస్థితులు చేజారితే అది ఎక్కడ వరకూ వెళుతుందో నా చేతుల్లోనూ ఉండదు.. నరేంద్ర మోడీ చేతుల్లోనూ ఉండదు. భారీ ప్రాణనష్టం తప్పదు. సమస్యకు యుద్ధం ఎన్నడూ పరిష్కారం కాదన్నారు. 
 
పైగా, "మీ దగ్గర, మా దగ్గర (శక్తిమంతమైన) ఆయుధాలున్నాయి. వీటిని కలిగిన మనం అవగాహనలేమితో, తప్పుడు అంచనాలతో యుద్ధానికి వెళ్లగలమా? యుద్ధం మొదలయ్యాక ఏం జరగుతుందో ఎవ్వరి చేతుల్లోనూ ఉండదు" ఉండదు అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో అణ్వస్త్ర హెచ్చరిక ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు