తోక ముడిచిన పాకిస్థాన్... ఎఫ్-16 వార్ ఫ్లైట్‌ను కూల్చిన భారత్

బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (12:22 IST)
భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పుల్వామా దాడికి భారత్ ప్రతీకార దాడి తీర్చుకుంది. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 రకం విమానాలు... పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి జైషే మొహమ్మద్ తీవ్రవాద తండాలపై దాడి చేశాయి. 
 
ఈ దాడులను పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. వీటికి ప్రతిగా పాకిస్థాన్ కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి, సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులోభాగంగా, బుధవారం పాక్‌ యుద్ధవిమానాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోని పూంచ్‌, రాజౌరీ సెక్టార్లలోకి వచ్చి బాంబులు జారవిడిచాయి. 
 
ఇప్పటికే పాక్ కదలికను నిషితంగా గమనిస్తోన్న భారత యువసేన... వెంటనే రంగంలోకి దిగింది. పాక్ యుద్ధ విమానాలను అడ్డుకునేందుకు భారత్‌కు చెందిన యుద్ధవిమానాలు వాటిని అడ్డుకున్నాయి. భారత వాయుసేన రంగంలోకి దిగడంతో ప్రమాదాన్ని గుర్తించిన పాక్ విమానాలు వెంటనే తోకముడిచి పారిపోయాయి. 
 
మొత్తంమీద భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో సరిహద్దు రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎయిర్‌బేస్‌ల వద్ద త్రివిధ దళాలకు చెందిన సైనికులకు మొహరించింది. అలాగే, పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 రకం యుద్ధ విమానాన్ని భారత సైనికులు కూల్చివేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు, పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో రాకపోకలపై నిషేధం విధించింది. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన నేపథ్యంలో సరిహద్దుల్లో రాత్రివేళ పౌరుల రాకపోకలపై భారత సైన్యం నిషేధం విధించింది. సరిహద్దుల్లోని పట్టణ ప్రజలను ఖాళీ చేయించక పోయినా..  ఐదు కిలోమీటర్ల పరిధిలో పౌరులు సంచరించవద్దని సైనికులు విజ్ఞప్తి చేశారు. 
 
ఏప్రిల్ మొదటివారం వరకు సరిహద్దుల్లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో రాత్రి 6 నుంచి ఉదయం 7 గంటలకు వరకు పౌరులు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించింది. రాజస్థాన్ రాష్ట్రంలో పాక్ మీదుగా 1,048 కిలోమీటర్ల సరిహద్దు విస్తరించి ఉంది. 
 
ఇక గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, ఇంటలిజెన్స్ బ్యూరో, సరిహద్దు జిల్లాల ఐజీలతో సమీక్ష జరిపారు. బీఎస్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్ భద్రతా బలగాలతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దు ప్రాంతాల పౌరులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని గుజరాత్ సీఎం పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసారు. 
 
మరోవైపు, కాశ్మీర్ లోయలో అఫ్జల్ గురు స్క్వాడ్, జైషే తీవ్రవాదులతోపాటు స్లీపర్ సెల్స్ ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని ఇంటలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరించింది. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్, తరన్ తరన్, అమృతసర్, ఫిరోజ్ పూర్, ఫాజిల్కా జిల్లాల్లోని 553 కిలోమీటర్ల పాకిస్థాన్ సరిహద్దుల్లో పౌరుల రక్షణకు పోలీసులు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కేంద్రం డీజీపీలను ఆదేశించింది. దీంతోపాటు పాకిస్థాన్ సరిహద్దుల్లో వచ్చే మూడురోజుల పాటు బీఎస్ఎఫ్ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు