భారతదేశఁలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోందని, దీన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ అమలు చేయాలని అమెరికా అంటు వ్యాధుల నివారణ నిపుణుడు, ఆ దేశాధ్యక్షుడికి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. పైగా, 140 కోట్ల మంది జనాభాలో ఇప్పటివరకు కేవలం 2 శాతం మాత్రమే వ్యాక్సిన్ వేశారని గుర్తుచేశారు. మిగిలిన జనాభాకు వ్యాక్సిన్ వేసేందుకు చాలాకాలం పడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్డౌన్ ఒక్కటే ఏకైక మార్గమని తెలిపారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, భారత్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న ఆయన.. చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరిస్థితులను సమగ్రంగా పర్యవేక్షించేందుకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
తక్షణమే ఆక్సిజన్, చికిత్సకు అవసరమైన ఔషధాలు, పీపీఈ కిట్లు సమకూర్చుకోవాలని సూచించారు. కొన్ని వారాలు లాక్డౌన్‌తో పెద్దగా సమస్యలేమీ ఉండవన్నారు. ఇందుకు చైనాను ఉదాహరణగా పేర్కొన్నారు.