ఓ చిరుద్యోగి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దీనికి కారణం అతనికి బిగ్ టిక్కెట్ డ్రా వరించింది. ఫలితంగా అతనికి రాత్రికిరాత్రే ఏకంగా రూ.8.27 కోట్లు వచ్చాయి. అతని పేరు కృష్ణంరాజు. భారతీయ కార్మికుడు. దుబాయ్‌లోని రస్ అల్‌ఖైమాలో ఓ నిర్మాణ రంగ సంస్థలో 9 ఏళ్ల నుంచి చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. తాజాగా అబుదాబీలో వెలువడిన 'బిగ్ టికెట్ డ్రా'లో అతడిని లక్ష్మీదేవి వరించింది.
దీనిపై అతను స్పందిస్తూ... గత మూడేళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇందుకు ప్రతినెలా సంపాదనలో కొంత డబ్బును పక్కన పెట్టేవాడినని చెప్పాడు. ఈ దఫా మాత్రం లక్కీగా ధరనంతా తానే భరించి టికెట్ కొన్నట్టు చెప్పాడు.
ఆ తర్వాత 'అప్పుడే నా పేరుతో వాళ్లు ఓ ట్వీట్ చేశారు. దాన్ని చూశాక నాకు ఆనందంతో గుండె ఆగినంత పనయింది. నేను విన్నర్‌గా సెలెక్ట్ అయ్యానని వెబ్‌సైట్‌లో చూశాకే మా వాళ్లకు విషయాన్ని చెప్పా. ఈ అరగంట వరకూ నేను టెన్షన్‌తో గడిపా..' అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. దీంతో ఇన్నాళ్లూ తలభారంగా మారిన అప్పులు, ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోయినట్టేనని సంతోషంతో చెప్పాడు.