మన పురాతన కల నిజం కానుందా.. మనిషి అదృశ్యం కానున్నాడా.. ఎలా?

శనివారం, 22 జులై 2017 (07:09 IST)
మనం చూస్తున్నట్లే మన కళ్లముందే మనుషులు, దేవుళ్లు, మాంత్రికులు మాయమైపోవడం ఒకవైపు పురాణాల్లోనూ, మరోవైపు సినిమాల్లోనూ మాత్రమే సాధ్యం. కాని అలా అదృశ్యమయ్యే శక్తి మనిషికి నిజంగా లభిస్తే.. ఆ ఊహ సామాన్యమైంది కాదు. మానవజాతి తన బాల్యదశనుంచి కంటున్న మహాద్భుతమైన కల అది. మన ఊహల్లో మాత్రమే ఫాంటీసీ రూపంలో తచ్చాడిన ఈ అదృశ్య శక్తి కొంత కాలం తర్వాత నిజంగానే మనిషికి సాధ్యపడుతుందని సైంటిస్టులు నమ్మకంగా చెబుతున్నారు. 
 
దీనికి కారణం నానో టెక్నాలజీ. అకస్మాత్తుగా ఉన్నచోటి నుంచి మాయమైపోవడం ఇప్పటికైతే సినిమాలకే పరిమితం కానీ.. సమీప భవిష్యత్తులో ఈ అద్భుతం నిజ జీవితంలోనూ నానో టెక్నాలజీ వల్ల సాధ్యం కానుంది. నానోటెక్నాలజీ రంగంలో మిషిగాన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి ఇందుకు కారణం. కంప్యూటర్ల మైక్రో ప్రాసెసర్ల తయారీకి సిలికాన్‌ లాంటి సెమీ కండక్టర్లను వాడుతుంటాం కదా.. అలాంటి పదార్థాల్లోకి వీరు నానోస్థాయి లోహపు కణాలను చొప్పించగలిగారు. 
 
అతితక్కువ సిలికాన్‌ను వాడి మైక్రో ప్రాసెసర్లను తయారు చేయడం వీలవుతుంది. ఈ నానోస్థాయి లోహపు కణాలు సెమీ కండక్టర్లలో ఎక్కడెక్కడ, ఎలా చేరాలో నియంత్రించే అవకాశం కూడా ఉండటం వల్ల ‘రివర్స్‌ రిఫ్రాక్షన్‌’అనే భౌతిక ధర్మం ఆధారంగా వస్తువులను పాక్షికంగా కనిపించకుండా చేయొచ్చని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాచల్‌ గోల్డ్‌మ్యాన్‌ అంటున్నారు. 
 
సెమీ కండక్టర్లలోకి లోహపు నానో కణాలు చొప్పిస్తే.. అవి అతిసూక్ష్మమైన అద్దాలుగా పనిచేస్తాయని, తన గుండా ప్రవహించే విద్యుత్తులో ఎక్కువభాగాన్ని కాంతిగా మార్చగలవని తెలిపారు. ఈ రకమైన సెమీ కండక్టర్లను ఎల్‌ఈడీల్లో ఉపయోగిస్తే వాటి సామర్థ్యం 50 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు. 
 

వెబ్దునియా పై చదవండి