ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను రద్దు చేసిన భారత్!

వరుణ్

సోమవారం, 15 ఏప్రియల్ 2024 (11:19 IST)
ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో భారత్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎంతో పటిష్టంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌కు నడుపుతున్న విమాన సర్వీసులను భారత్ రద్దు చేసింది. ముఖ్యంగా... ఇజ్రాయెల్‌లోని అత్యంత కీలక నగరమైన టెల్ అవీవుకు భారత్ నడిపే విమానాలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య నేరుగా నడుస్తున్న సర్వీసులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు ఎయిరిండియా ఆదివారం పొద్దుపోయాక ప్రకటించింది.
 
ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య వారానికి 4 సర్వీసులను నడుపుతోంది. 5 నెలల సుధీర్ఘ విరామం తర్వాత మార్చి మూడో తేదీనే ఈ సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. గతేడాది అక్టోబరు 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు టెల్అవీవ్ నరమేధం సృష్టించడం, అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడికి విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించిన విషయం తెలిసిందే.
 
ఇదిలావుంటే, శనివారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. 200లకుపైగా డ్రోన్లు, డజన్ల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులతో దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఇటీవల సిరియాలోని డమాస్కస్ ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్ రివల్యూషరీ గార్డ్స్‌కు చెందిన కీలక అధికారితో పాటు 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని, ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ తాజా దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు