వారసత్వ రాజకీయాలు అంటూ ఆసియా దేశాల పాలకులను పాశ్చాత్య దేశాలు ఆడిపోసుకుంటూ ఉంటాయిగానీ తమ విషయానికి వచ్చేసరికి గురువింద గింజలాగా వ్యవహరిస్తుంటాయి. ప్రభుత్వంలో ఉన్నత పదవిలో తండ్రి లేదా భర్త ఉన్నప్పుడు ఆ పదవితో ముడిపడివున్న ఎలాంటి విధుల్లోనూ కుటుంబ సభ్యులు భాగం కాకూడదన్న నీతి ఒకప్పటి రాజకీయాలతోనే వెళ్లిపోయింది. పైగా సమర్థులైన వారు వారసులుగా రాజకీయాల్లోకి, పదవుల్లోకి వస్తే తప్పేంటి అనే అడ్డగోలు వాదన చాలా కుటుంబాలను వారసత్వ రాజకీయాల్లోకి కొనితెస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినుంచి వైట్ హౌస్ ఇక కుటుంబపాలనగా మారిపోతుందని చాలామంది అమెరకన్లు భయాందోళనలకు గురయ్యారు. వాటిని ఏమాత్రం సరకు చేయని ట్రంప్ గతంలోనే తన అల్లుడు జారెడ్ కుష్నెర్ (36)ను సలహాదారుగా నియమించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన కూతురుని కూడా ముగ్గులోకి దింపేశాడు. మరో మాటలో చెప్పాలంటే ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా ఇప్పుడు వైట్ హౌస్‌లో అధ్యక్షుడి ప్రత్యేక అసిస్టెంట్ అయిపోయారు. అంటే ఇప్పటినుంచి ఇవాంకా అధికారికంగానే ప్రభుత్వ ఉద్యోగి అన్నమాట.
ట్రంప్ కుటుంబ సభ్యులైన కుష్నర్, ఇవాంకా ఇకనుంచి శ్వేతసౌధంలో అధికారిక పాత్ర పోషించనున్నారు. ఇవాంకా ఈమధ్యే మీడియాతో మాట్లాడుతూ తన తండ్రికి సలహాదారుగా సేవలందించాలని అనుకుంటున్నట్లు చెప్పారు కూడా. అన్నట్లుగానే ఇప్పుడామె ఏకంగా అధ్యక్షుడి ఆఫీసులోకి అడుగుపెట్టేశారు. వైట్ హౌస్ ప్రకటన వెలువడగానే ఇవాంకా నియామకంపై అమెరికన్లు విమర్శలతో వెల్లువెత్తారు.
దీనికి ముందే సమాధానం వెతికి పెట్టుకున్న ఇవాంకా. వైట్‌హౌస్‌లో తన సేవలకు సింగిల్ డాలర్ కూడా వేతనంగా తీసుకోనని శపథం చేసేశారు. మొత్తానికి ఒక పనైపోయింది. అధ్యక్షుడూ, ఆయన అల్లూడూ, పెద్ద కూతురూ.. ఉద్యోగులైపోయారు. ఇక చిన్నకూతురును పక్కన పెట్టడం ఎందుకు.. ఆమెకు కూడా చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం కట్టబెడితే పోలా అంటూ నెటిజన్లు మేలమాడుతున్నారు.
వారసత్వం అనేది రాజకీయాలకు, రాజ్యాంగ పదవులకు మాత్రమే కాదు.. ఉద్యోగాలకు కూడా వర్తిస్తుందంటే సందేహం ఎందుకు. దానికి మన ఇవాంకా, మన కుష్నెర్‌లే తిరుగులేని సాక్షి కదా.