పన్ను చెల్లింపుల్లోనే కాదు... రాజకీయాల్లోనూ "కింగ్" మేకర్లం కావాలి : రాజమౌళి గుప్తా

ఆదివారం, 28 మే 2017 (15:49 IST)
దేశంలో పన్ను చెల్లింపుదారుల్లో వైశ్యులు అగ్రగామిగా ఉన్నారనీ, అలాగే రాజకీయాల్లోనూ కింగ్ మేకర్లుగా మారాలని ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ (అంతర్జాతీయ ఆర్యవైశ్య సంస్థ - ఐవీఎఫ్) కార్యాచరణ అధ్యక్షుడు డాక్టర్ గంజి రాజమౌళి గుప్తా పిలుపునిచ్చారు. ఆదివారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో ఐవీఎఫ్ తమిళనాడు శాఖ అధ్యక్షుడు డాక్టర్ కనిగెలుపుల శంకరరావు అధ్యక్షతన జాతీయ స్థాయి సమావేశం జరిగింది.
 
ఇందులో కేవలం తమిళనాడుకు చెందిన ప్రతినిధులు మాత్రమే కాకుండా, దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఐవీఎఫ్ ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘాలు, జైన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్తా మాట్లాడుతూ దేశంలో పన్ను చెల్లిస్తున్న వారిలో 70 శాతం ఆర్యవైశ్యులే ఉంటూ, దేశ ఆదాయానికి వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. 
 
అలాగే, రాజకీయాల్లోనూ కింగ్ మేకర్లుగా అవతరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఆర్యవైశ్యుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ లక్షల్లో ఆర్యవైశ్యులు ఉన్నారన్నారు. వారంతా ఓటు హక్కు వేస్తే ఖచ్చితంగా రాజకీయాల్లోనూ రాణించి, కింగ్ మేకర్లుగా అవతరిస్తామని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా, ఉత్తరభారతదేశంలో ఐపీఎస్‌, ఐఏఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నారనీ, అందువల్ల అక్కడ అభివృద్ధి గణనీయంగా సాగుతోందన్నారు. అలాగే, దక్షిణ భారత్‌లోనే కాకుండా, అన్ని రాష్ట్రాల్లో ఆర్యవైశ్యుల ప్రాధాన్యత పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అంతకుముందు సభాధ్యక్షుడు అజంతా శంకర రావు స్వాగతోపన్యాసం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న మన సామాజికవర్గానికి చెందిన వారంతా ఐక్యంగా ఉండాలన్న ముఖ్యోద్దేశ్యంతో ఐవీఎఫ్‌ను స్థాపించడం జరిగిందన్నారు. ఇందులో అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారన్నారు. ముఖ్యంగా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఉన్న ఆర్యవైశ్యులు ఆర్యవైశ్య సంస్కృతీ సంప్రదాయాలను, తెలుగు భాషను పరరిక్షిస్తూ ముందుకు సాగడం చాలా హర్షణీయమన్నారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉన్నట్టయితే అనుకున్నది సాధించుకోవచ్చన్నారు.
 
ఇకపోతే ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి కొప్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ కోటి రూపాయలు ఇచ్చి అయినా సరే కోమటులతో వ్యాపారం చేయాలన్న సామెత ఉందన్నారు. అంటే ఆర్యవైశ్యులతో చేయికలిపి వ్యాపారం చేసే వారిని నష్టపోనివ్వకుండా, లాభాలు అర్జింజి, పైకి ఎదిగేందుకు దోహదపడతారన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మనతో కలిసి వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతారన్నారు. అయితే, ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారం, సంపాదనకే పరిమితం కాకుండా, తమ శక్తియుక్తులను ప్రదర్శించి, దేశంలో అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాజకీయాల్లో మన సత్తా చాటాలని కోరారు. 
 
అలాగే, ఐవీఎఫ్ కర్నాటక విభాగం కార్యదర్శి శరవణ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని అపుడు తమ సమస్యలతో పాటు.. తమ వారసులకు సమాజంలో సమున్నత స్థానం కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాలు చేసుకుంటూనే కొంత సమయాన్ని ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం వెచ్చించాలని కోరారు. కాగా, ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మహేష్, రాష్ట్ర ప్రతినిధుల కె.రవికుమార్, జె మదన్ గోపాలరావు, పువ్వాడ శేషాద్రి, కరూర్ వైశ్యా బ్యాంకు డైక్టర్ విజయలక్ష్మి, గోపురం కుంకుమ సంస్థ అధినేత వైవీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఐవీఎఫ్ కొన్ని తీర్మానాలు, డిమాండ్లు చేసింది. వాటిని కేంద్ర రాష్ట్రాలు పరిష్కరించాలని కోరింది. 

వెబ్దునియా పై చదవండి