మొరాకో దేశంపై ప్రకృతి కన్నెర్రజేసింది. శనివారం సంభవించిన భూకంపంలో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఈ మృతుల సంఖ్య ఆదివారం ఉదయానికి రెండు వేలకు చేరింది. కూలిపోయిన నిర్మాణాల శకలాలను వెలికి తీసేకొద్దీ మృతదేహాలు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా ఈ మృతుల సంఖ్య 2,012కు చేరింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఓ ఫ్రెంచివాసిని తాజాగా గుర్తించారు. మరో 1404 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మూడు రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ కింగ్ మహమ్మద్-6 నిర్ణయం తీసుకొన్నారు. బాధితులకు ఆహారం, పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు అర్థరాత్రి వీధుల్లోనే గడిపారు. శిథిల భవనాల నుంచి వీలైనన్ని నిత్యావసరాలను ప్రజలు తమతోపాటు తెచ్చుకొన్నారు.