నిన్నమొన్నటివరకు ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐఎస్ఐఎస్) ఇపుడు చక్రబంధంలో చిక్కుకుంది. ఆ సంస్థ చీఫ్ అబూబకర్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఇరాక్ దేశాలకు చెందిన ప్రత్యేక దళాలు.. ఐఎస్ కీలక స్థావరమైన మూసూల్ నగరాన్ని చుట్టుముట్టి... అష్టదిగ్బంధనం చేశాయి. దీంతో ఐఎస్ ఉగ్రవాదాలు ఏం చేయోలో తెలియక.. గడ్డాలు మీసాలు తీసేసి సాధారణ ప్రజల్లో కలిసిపోతున్నారు. దీంతో ఉగ్రవాద సంస్థ ఐఎస్ పని ఇక అయిపోయినట్టే? ఉగ్రవాదుల ఆట ముగిసినట్టే? అనిపిస్తోంది.
అమెరికా సేనలతో కలిసి మోసుల్ స్వాధీనమే లక్ష్యంగా ముందుకు కదిలిన ఇరాకీ సేనలు ఆ దిశగా విజయంవైపు వడివడిగా అడుగులేస్తున్నాయి. మోసుల్‌లోని పలు జిల్లాలను ఇప్పటికే తమ అధీనంలోకి తెచ్చుకున్న బలగాలు ఐఎస్ చీఫ్‌ను అంతమొందించడమే లక్ష్యంగా సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. బాగ్దాదీ కనుక హతమైతే ఇక ఐఎస్ కుప్పకూలినట్టేనని భావిస్తున్నారు.
అదేసమయంలో సంయుక్త ప్రత్యేక బలగాల ధాటికి తట్టుకోలేని ఉగ్రవాదులు ఇప్పటికే తలోదిక్కు పారిపోతున్నారు. మరికొందరు ఎదురొడ్డి పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు గడ్డాలు, మీసాలు తీసేసి సాధారణ పౌరుల్లో కలిసి పోతున్నారు. ఇక ఐఎస్ ముష్కరుల చెర నుంచి బయటపడిన జిల్లాల ప్రజలు ఆనందంతో రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తున్నారు.