లఖ్వీకి 15 యేళ్ళ జైలుశిక్ష - పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు

శుక్రవారం, 8 జనవరి 2021 (19:37 IST)
ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి, లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు శుక్రవారం సంచలన తీర్పున వెలువరించింది. ముంబై దాడుల కేసులో 61 ఏళ్ల లఖ్వీ 2015 నుంచి బెయిలుపై బయట ఉన్నాడు. 2008 ముంబై దాడుల తర్వాత ఐక్యరాజ్య సమితి లఖ్వీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో గత వారం ఆయన్ను పంజాబ్ ప్రావిన్స్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సీటీడీ) అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నట్టు ఆరోపిస్తూ ఉగ్రవాద నిరోధక చట్టం 1977 కింద 15 ఏళ్ల క్రితం లఖ్వీపై సీటీడీ కేసు నమోదు చేసింది. 
 
ఈ కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం (ఏటీసీ) తాజాగా లఖ్వీని దోషిగా తేల్చింది. ఒక్కో అభియోగం కింద ఐదేళ్లు చొప్పున మొత్తం 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ బట్టర్ తీర్పు చెప్పారు. 
 
అలాగే, ఒక్కో అభియోగం కింద లక్ష పాకిస్థాన్ రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా ఒక్కోదాంట్లో ఆరు నెలల చొప్పున మరో ఏడాదిన్నర పాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు