భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన స్పందిస్తూ బలూచిస్థాన్ గురించి మాట్లాడటం ఆపకపోతే తాము ఖలిస్థాన్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, సిక్కిం, మావోయిస్టు తిరుగుబాట్లను ప్రస్తావిస్తామన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొనాలంటే కాశ్మీరు సమస్య పరిష్కారమవ్వాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రికి ప్రత్యేక దూత, సెనేటర్ ముషామిద్ హుస్సేన్ సయీద్ చెప్పారు.
కాబూల్‌లో ప్రశాంతత కాశ్మీరుపై ఆధారపడి ఉందన్నారు. వేర్వేరు భాగాలుగా శాంతిని సాధించలేమన్నారు. కాబూల్‌లో శాంతిని స్థాపించడం, కాశ్మీరును మండించడం జరిగేపని కాదన్నారు. కాశ్మీర్ పరిష్కారం కాకపోతే శాంతి నెలకొనదని స్పష్టం చేశారు. భారతదేశం, పాకిస్థాన్ అణ్వాయుద దేశాలని చెప్తూ కాశ్మీరు సమస్యపై శాంతియుత పరిష్కారం అవసరమన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపనకు భారతదేశం, అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు తాము విఘాతం కలిగిస్తామన్న ధోరణితో ఆయన ప్రసంగం కొనసాగింది.