భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై రోజుకో కథనం వెలుగులోకి వస్తోంది. నేతాజీ విమాన ప్రమాదంల చనిపోయినట్టు నిన్నామొన్నటివరకు వార్తలు వచ్చాయి. అయితే, ఇపుడు అలా చనిపోలేదని ఫ్రెంచ్ చరిత్రకారుడు ఒకరు చెపుతున్నారు. పైగా, 1947 వరకు ఆయన జీవించే ఉన్నారనీ, దీనికి 1947 డిసెంబర్ 11నాటి ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ నివేదికే సాక్ష్యమంటున్న ఆయన అంటున్నారు.
నిజానికి నేతాజీ ఎలా మరణించారనే దానిపై ఇప్పటికీ స్పష్టతలేదు. దీనిపై భారత ప్రభుత్వం షానవాజ్ కమిషన్ (1956), ఖోస్లా కమిషన్ (1970) ముఖర్జీ కమిషన్ (1999) నియమించినా, ఖచ్చితమైన నిర్ధారణకు రాలేక పోయింది. తాజాగా, ఫ్రెంచ్ చరిత్రకారుడు జే బీపీ మోరె కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నేతాజీ అసలు విమాన ప్రమాదంలో చనిపోలేదని, 1947 వరకు బోస్ బతికే ఉన్నారని మోరె చెప్తున్నారు.
1947 డిసెంబర్ 11న అప్పటి ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ ఇచ్చిన నివేదిక ఇందుకు సాక్ష్యమని ఆయన వాదిస్తున్నారు. ఇండోచైనా యుద్ధం నుంచి బోస్ తప్పించుకున్నా 1947 డిసెంబర్ 11 వరకు ఆయన ఆచూకీ తెలియరాలేదని నివేదికలో ఉన్నది. అంటే 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారనే వార్తలను ఫ్రెంచ్ ప్రభుత్వం ఎప్పుడూ ధ్రువీకరించలేదు అని ఆయన అంటున్నారు.
అందరూ చెబుతున్నట్టు నేతాజీ ఆగస్టు 18, 1945 నాటి విమాన ప్రమాదంలో మరణించలేదని మోర్ వాదనగా ఉంది. అయితే ఆయన ఇండోచైనా నుంచి తప్పించుకున్నారని, డిసెంబరు 11, 1947 వరకు ఆయన ఎక్కడున్నదీ తెలియరాలేదని మోర్ తెలిపారు.
కాగా, సుభాష్ చంద్రబోస్ సైగోన్ నుంచి జపాన్‌లోని టోక్యోకు వెళుతుండగా విమాన ప్రమాదంలో మృతి చెందారని బ్రిటన్, జపాన్‌లు ఎప్పుడో ధ్రువీకరించాయి. అయితే ఈ విషయంలో ఫ్రెంచ్ మాత్రం ఇప్పటికీ సైలెంట్‌గానే ఉంది. మరోవైపు ఈ సీక్రెట్ నివేదికను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.