పబ్జీకి బానిసయ్యాడు.. కుటుంబాన్నే తుపాకీకి బలి చేశాడు.. ఎక్కడ?

శనివారం, 29 జనవరి 2022 (22:36 IST)
పబ్జీ గేమ్ చాలా డేంజరస్ అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఈ గేమ్‌పై ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు నిషేధం సైతం విధించాయి. అయినప్పటికీ, వీపీఎన్‌లు మార్చి ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకుని ఆడుతున్నారు. 
 
తాజాగా ఈ గేమ్‌కు బానిసైన ఓ 14ఏళ్ల బాలుడు కుటుంబం మొత్తాన్ని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకెళ్తే నాహిద్ ముబారక్(45) అనే మహిళా హెల్త్ వర్కర్. భర్త నుంచి విడాకులు తీసుకుని లాహోర్‌కు సమీపంలోని కహ్నా ప్రాంతంలో నలుగురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. మూడో సంతానమైన 14ఏళ్ల బాలుడు తరచూ పబ్జీ గేమ్‌ ఆడుతూ ఉండేవాడు. గంటలు గంటలూ చదువుపై ధ్యాస లేకుండా పబ్జీ ఆడేవాడు.
 
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సైతం పబ్జీ గేమ్‌ ఆడుతూనే ఉండటంతో మరోసారి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు.. రక్షణ కోసం తీసుకున్న లైసెన్స్‌డ్ తుపాకీతో తల్లిని కాల్చాడు. అంతటితో ఆగకుండా పడుకుని ఉన్న అతడి అన్న(22), అక్క(17), చెల్లి(11)పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అందరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
తెల్లారి ఏం తెలియనట్టు ఇరుగుపొరుగు వారికి చెప్పగా, వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా లాహోర్‌లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం 2020 నుంచి ఇది నాలుగోదని పాక్‌కు చెందిన డాన్ పత్రిక వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు