పాకిస్థాన్ వక్రబుద్ధి : భారత జవాను మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి సరిహద్దుల్లో పారేశారు!

బుధవారం, 23 నవంబరు 2016 (10:13 IST)
పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టింది. భారత్ సర్జికల్ దాడుల తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్థాన్ సైనికులు మరోసారి దారుణంగా వ్యవహరించారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో మరణించిన భారత జవాను మృతదేహాన్ని ఖండఖండాలు చేసి వికృతానందాన్ని తీర్చుకున్నారు. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత, భారత జవాను మృతదేహాన్ని ఇలా ముక్కముక్కలు చేయడం గత నెల రోజుల్లోనే ఇది రెండోసారి. కాశ్మీర్‌లోని మచ్చల్‌ సెక్టర్‌లో నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం సాయంత్రం పాక్‌ దళాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. పాక్‌ సైనికులు, ఆర్మీ మద్దతు ఇచ్చే ఉగ్రవాదులతో కూడి ఉండే బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ (బ్యాట్‌) ఈ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
 
వారిలో ఒకరి మృతదేహాన్ని పాక్‌ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. దానిని ముక్కముక్కలుగా ఛిద్రం చేసి మరీ భారత సరిహద్దుల్లో పారేశారు. పాక్‌ దళాలు భారత భూభాగంలోకి అడుగుపెట్టి.. మన జవాన్లను తీవ్ర చిత్రహింసలు పెట్టి, వారి శరీరాలను ఛిద్రం చేయడం అనేది నెలలో ఇది రెండోసారి. 
 
ఇంతకుముందు సిపాయి మన్‌దీప్‌ సింగ్‌ మృతదేహాన్ని కూడా పాక్‌ ఉగ్రవాదులు ఇలాగే ఛిద్రం చేశారు. దీంతో ఏ క్షణమైనా ప్రతీకార దాడులకు పాల్పడాలని భారత్ యోచిస్తోంది. పాక్ చేసిన దానికి పదింతలు దెబ్బతీయాలని, ఈసారి దాడి అత్యంత తీవ్రంగా ఉండేలా చూడాలని సైన్యానికి పర్రీకర్‌ సూచించినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి