అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలిపోయిన దాయాది దేశం పాకిస్థాన్ వెనక్కు తగ్గింది. మొదట్లో పుల్వామా దాడులకు సాక్ష్యం చూపించమని కోరిన పాక్.. ఆ సాక్ష్యాలు జైషే-ఏ-మహమ్మద్ సంస్థ ప్రకటించడంతో నాలుక కరచుకొని, ఆపై భారత్ చేస్తున్న ఎయిర్ స్ట్రయిక్‌లను గురించి అన్ని దేశాలతోనూ మొరపెట్టుకొని అందరితోనూ మొట్టికాయలు తిన్న తర్వాత ఇప్పుడు తన మంచితనాన్ని నిరూపించుకోవాలనే తాపత్రయంతో తమ అదుపులో ఉన్న భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్‌ను శుక్రవారం భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించింది.
అదేసమయంలో ఈ ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన పుల్వామా దాడి తామే చేసామని ప్రకటించుకున్న జైష్-ఎ-మహమ్మద్ సంస్థను, దాని అధినేత మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే డిమాండ్లు మిన్నంటుతున్న నేపథ్యంలో భారత్ వద్ద మసూద్‌కు వ్యతిరేకంగా ఏవైనా ఆధారాలు ఉంటే తమకు చూపాలనీ, తాము వెంటనే అతనిపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి హామీ ఇచ్చారు.
పాకిస్తాన్ ఎటువంటి ఉగ్రవాద చర్యలనూ అనుమతించబోదని స్పష్టం చేశారు. మసూద్ అజర్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని అంగీకరించిన ఆయన అయితే మసూద్ ఆరోగ్యం బాగాలేదని, కనీసం ఇంట్లో నుండి బయటకు కూడా రాలేకపోతున్నారని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటే భారత ప్రభుత్వం ఖచ్చితమైన ఆధారాలు చూపాలని వెల్లడించారు. ఆధారాలు లేకుండా ఏమీ చేయలేమని చేతులెత్తేసారు. ముందు ముందు ఇంకేమి చెప్పబోతారో... పాపం.