జమ్మూకాశ్మీర్‌లోని సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై లష్కర్ తోయిబా తీవ్రవాదులు దాడికి పాల్పడగా, పలువురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రతీకారదాడికి సిద్ధమవుతోంది. అంటే.. మరోమారు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే అంశంపై భారత రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందిస్తూ, సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడికి ప్రతీకారం తప్పదంటూ హెచ్చరికలు చేసింది. దీంతో పాకిస్థాన్ వణికిపోతోంది. రక్షణ మంత్రి హెచ్చరికల నేపథ్యంలో భారత్ మరోమారు సర్జికల్ స్ట్రైక్స్ జరిపితీరుతుందని గట్టిగా భావిస్తోంది.
అందుకే భారత్‌ను హెచ్చరిస్తూ పాకిస్థాన్ విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. భారత అధికారులు కావాలనే జేఈఎమ్‌ను ఈ దాడిలోకి లాగుతున్నారని చెప్పింది. సరైన విచారణ జరపకుండా బాధ్యతారాహిత్యంతో పాక్‌పై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పుకొచ్చింది. అలాగే తమ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొస్తున్న భారత్‌ను అడ్డుకోవాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.