పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ వ్యూహాలు రచిస్తోంది. పైగా, గతంలో గుట్టుచప్పుడుకాకుండా సర్జీకల్ స్ట్రైక్స్ నిర్వహించినట్టుగానే ఈ దఫా కూడా ప్రతిచర్యకు భారత్ సిద్ధమవుతోంది. దీంతో పాకిస్థాన్ పాలకులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆ దేశప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇదే అంశంపై రక్షణరంగ నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
భారత్ కయ్యానికి కాలుదువ్వినపక్షంలో ఏం చేయాలన్న అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఏ విధంగా చూసుకున్న భారత్‌తో సరితూగమన్నది ఇమ్రాన్ ఖాన్ బలంగా నమ్ముతున్నారు. దీనికి మంచి ఉదాహరణ ఇరు దేశాల రక్షణ రంగ బడ్జెట్టే. పాకిస్థాన్ బడ్జెట్ కేవలం రూ.56 వేల కోట్లు మాత్రమే. అదే భారత్ రక్షణ రంగ బడ్జెట్ రూ.2.95 లక్షల కోట్లు. అంటే భారత బడ్జెట్ కేటాయింపుల్లో పాకిస్థాన్ రక్షణ రంగ బడ్జెట్ ఐదో వంతు మాత్రమే.
పైగా, భారత త్రివిధ దళాలతో పోలిస్తే పాక్ సైన్యం, వైమానికదళం, నౌకాదళం అన్నీ బలహీనంగా ఉన్నాయి. భారత్ కొనుగోలు చేస్తున్న యుద్ధవిమానాలకు ధీటైన యుద్ధవిమానాలు సమకూర్చుకునే స్థోమత పాక్‌కు లేదు. వీటన్నిటినీ మరచి పాకిస్థాన్ గనక భారత్‌పై ఎగబడితే ఆర్థికంగా మరింత నష్టపోతుందని కూడా రక్షణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.