జింబాబ్వేలో 1980 వరకు బ్రిటీష్ వలసవాదం ఉండగా, అది అదే యేడాది అంతమైంది. ఆ తర్వాత దేశాధ్యక్ష బాధ్యతలను రాబర్ట్ ముగాబే చేపట్టారు. అలా ఆయన ఏకంగా 37 యేళ్ళ పాటు అధ్యక్షుడుగా కొనసాగారు. ఆయన కాలంలో జింబాబ్వే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. పైగా, తినేందుకు తిండి కూడా కరువైంది. దీనికి నిదర్శనం ఆ దేశ క్రికెటర్లు చోరీలకు కూడా పాల్పడ్డారు.
ముగాబేకు వ్యతిరేకంగా రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ప్రజలు సామూహిక నిరసన ప్రదర్శనలు చేశారు. అయినా ఆయన పదవి నుంచి దిగిపోయేందుకు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో 2017 నవంబర్ 21వ తేదీన ఆర్మీ తిరుగుబాటు చేసి అధికార పగ్గాలను కైవసం చేసుకుంది. అలా 93 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న దేశాధ్యక్షుడిగా ముగాబె రికార్డు సృష్టించారు.
అయితే, తనకు పోటీగా వస్తున్నాడంటూ చాలాకాలంగా తన డిప్యూటీగా ఉన్న ఎమర్సన్ ఎంనంగాగ్వాను కేబినెట్ నుంచి తప్పించి తన భార్య గ్రేస్ ముగాబెను తర్వాతి అధ్యక్షురాలిగా చేయాలని ముగాబె భావించారు. ఇదే ఆయన పతనానికి కారణమైంది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ... దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవడంతోపాటు ముగాబెను హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.