గత 2014లో ఒక సౌదీ అరేబియా రైతు తన వ్యవసాయ భూమిలో పైపులను భూమిలో వేసేందుకు తవ్వుతుండగా కొన్ని ఎముకలు బయటపడ్డాయి. తొలుత జంతువుల ఎముకలుగా భావించారు. ఆ తర్వాత అస్థిపంజరం లభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన సౌదీ పౌలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మరో నాలుగు అస్థిపంజరాలు లభించాయి. అందులో కొందరి నోటికి టేపులు చుట్టి, కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి ఉండటం గమనించారు.
అస్థిపంజరాల సమీపంలో లభ్యమైన వీసా కార్డు ఆధారంగా మరింత లోకుగా దర్యాప్తు చేపట్టగా మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. తన కూతురు, మరో మహిళను వేధించినందుకుగానూ ఒక సౌదీ యజమాని వారిని చిత్రహింసలకు గురిచేసి సజీవంగా పాతిపెట్టినట్లు ఈ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, వీరిలో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చి మరణశిక్షను విధించింది. ఫలితంగా ఈ ముగ్గురికి ఖతీఫ్ పట్టణంలో బహిరంగంగా శిరచ్ఛేదం చేసి మరణశిక్ష అమలు చేశారు.