బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలేదా జియాపై దేశ ద్రోహం కేసు... రేపు అరెస్టు వారెంట్

సోమవారం, 25 జనవరి 2016 (14:43 IST)
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియాపై దేశద్రోహం కేసు నమోదైంది. బంగ్లా విముక్తి పోరులో వీరమరణం పొందిన సైనికులను కించపరిచేలా కామెంట్లు చేసిన కారణంగానే జియాపై రాజద్రోహం కేసు నమోదైనట్లు ఢాకా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు చెందిన ఓ అధికారి చెప్పారు. జియాపై రాజద్రోహం కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి, ఆమె అరెస్టుకు సంబంధించి మంగళవారం అరెస్టు వారెంట్లు జారీ చేయనున్నారని సదరు అధికారి చెప్పారు.
 
పాకిస్థాన్‌పై 1971లో జరిగిన యుద్ధానికి సంబంధించి ఆమె పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం జరిగినపుడు జరిగిన మరణాల సంఖ్యలో తేడాలు ఉన్నాయంటూ గతేడాది డిసెంబర్‌ 21న వ్యాఖ్యానించారు. ఆ యుద్ధానికి సంబంధించి ఇప్పటికీ అనేక వివాదాలు ఉన్నాయని, ఆ వివాదాలపై అనేక పుస్తకాలు, దస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ఆమె అన్నారు. ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు ఆ దేశ రాజకీయాలను కుదిపేయనుంది. 

వెబ్దునియా పై చదవండి