అనారోగ్యంతో బుధవారం శివైక్యం పొందిన కంచి కామకోటి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గురువారం మహాసమాధి అయ్యారు. కంచి కామకోటి మఠం ప్రాంగణంలోనే ఆయన బృందావన ప్రవేశం చేశారు. కొంతకాలంగా రక్తపోటు, తీవ్ర మధుమేహం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన రోజూలాగానే బుధవారం ఉదయం కూడా 7.10 గంటల వరకూ భక్తులకు దర్శనమిచ్చిన ఆయన.. అంతలోనే అస్వస్థతకు గురయ్యారు. బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే స్పృహతప్పి పడిపోయారు.
చంద్రశేఖరేంద్ర స్వామి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశమయ్యారు. మహాసమాధి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, డాలర్ శేషాద్రి, తితిదే మాజీ ఈవో కనుమూరి బాపిరాజు తదితరులు జయేంద్ర సరస్వతికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.