వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యుఎఫ్‌పి)కి 2020 నోబెల్ బహుమతి ప్రదానం
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:42 IST)
ఐక్యరాజ్యసమితి సంస్థ వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్‌కి 2020 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. నోబెల్ కమిటీ శుక్రవారం ఈ ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలిపై పోరులో డబ్ల్యుఎఫ్‌పి అందించిన సహకారం కారణంగా 2020 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుందని నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది.
యుద్ధ వివాదాలు, ఘర్షణలు తలెత్తిన ప్రాంతాలలో శాంతి కోసం సానుకూల వాతావరణం ఏర్పడేందుకు, అలాగే ఆకలిని యుద్ధ ఆయుధంగా మలుచుకునే చర్యలను నిరోధించేందుకు డబ్ల్యుఎఫ్‌పి పెద్దయెత్తున కృషి చేసిందని నోబెల్ కమిటీ తెలిపింది. రోమ్ ఆధారిత ఆహార సంస్థ ప్రతి సంవత్సరం సుమారు 88 దేశాలలో 97 మిలియన్ల మందికి సహాయపడుతుందని తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తినడానికి సరిపడినంత ఆహారం లేక బాధపడుతున్నారని నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రైజ్ మనీ 11 లక్షల డాలర్లు డిసెంబరు 10న ఓస్టోలో జరిగే కార్యక్రమంలో శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు.