అమెరికా - ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. నిన్నామొన్నటివరకు ఒకరిపై ఒకరు కారాలుమిరియాలు నూరుకుంటూ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఇరు దేశాల అధ్యక్షులు జూన్ 12వ తేదీన సమావేశం కానున్నారు. వీరిద్దరూ సింగపూర్‌లో భేటీకానున్నారు. ప్రపంచ శాంతి కోసం తాము కలసి పని చేస్తామని ప్రకటించారు.
వింటర్ ఒలింపిక్స్ తర్వాత అమెరికా, ఉత్తర కొరియా మధ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఈ మధ్యే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. తర్వాతే ట్రంప్ - కిమ్ భేటీపై క్లారిటీ వచ్చింది. అటు అమెరికా.. ఇటు ఉత్తరకొరియాలో కాకుండా మధ్యలో సింగపూర్‌లో భేటీ కావాలని ట్రంప్ - కిమ్‌లు నిర్ణయించడం గమనార్హం.
నిజానికి రెండు నెలల క్రితం వరకు కిమ్.. ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగింది. క్షిపణి ప్రయోగాలు, అణ్వస్త్ర పరీక్షలతో అమెరికాను భయపెట్టే చర్యలో కిమ్ నిమగ్నమైపోయారు. ఖండాంతర క్షిపణులతో హవాయ్ ద్వీపంపై దాడి చేస్తామంటూ హెచ్చరించారు. ఇటు ట్రంప్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావడంతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చైనా, దక్షిణకొరియా దేశాల జోక్యంతో వెనక్కి తగ్గారు.