ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన ఇమ్మిగ్రేషన్ ఆదేశాలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ట్రంప్ ఆదేశాలను ఆ దేశ అటార్నీ జనరల్ ధిక్కరించారు. ఆయన ఆదేశాలను అమలు చేయనని తేల్చి చెప్పారు. దీంతో ఆమెను పదవి నుంచి క్షణాల్లో తొలగించారు.
అమెరికా పౌరుల రక్షణ కోసం రూపొందించిన న్యాయపరమైన ఆదేశాన్ని అమలు చేసేందుకు అటార్నీ జనరల్ నిరాకరించారు. శరణార్థులపై ప్రెసిడెంట్ ఆదేశం చట్టపరంగా లేదని సల్లీ యేట్స్ అభిప్రాయపడ్డారు. తాను అటార్నీ జనరల్‌గా ఉన్నంత వరకు ప్రెసిడెంట్ ఆర్డర్‌పై న్యాయశాఖ ఎటువంటి వాదనలు చేయదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఆమెపై వేటు వేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ నిషేధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను తొలిగించారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా సమయంలో సల్లీ యేట్స్ నియామకం జరిగింది. ముస్లిం శరణార్థులను అడ్డుకోవాలంటూ ట్రంప్ జారీ చేసిన ఫర్మానాను అమలు చేయవద్దంటూ అటార్నీ జనరల్ సల్లీ న్యాయశాఖ లాయర్లకు ఆదేశించారు. దీంతో ఆమెను విధుల నుంచి బహిష్కరిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అటార్నీ జనరల్ సల్లీ యేట్స్ న్యాయశాఖను మోసం చేసిందని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. ప్రస్తుతం వర్జీనియా అటార్నీగా ఉన్న డానా బొన్నెట్‌ను తాత్కాలిక అటార్నీ జనరల్‌గా నియమించారు.