పోలవరం ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగిందో డీపీఆర్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రి గడ్కరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సరైన పత్రాలను సమర్పిస్తేనే నిధుల విషయంలో ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందన్న ఆయన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఆర్ మార్పుపై గడ్కరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. అలాగే ప్రాజెక్టు వ్యయంపై కూడా ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న విధివిధానాలను ఒక్క ఆంధ్రప్రదేశ్ కోసం మార్చలేమని స్పష్టం చేశారు.
సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయం రూ.57వేల940 కోట్లు ఖర్చవుతుందని అందులో భూసేకరణకే 33 వేల కోట్లవుతుందని లెక్కలతో సహా వివరించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని గడ్కరి స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై జాప్యం జరుగుతుందని.. ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని గడ్కరీ తేల్చారు.