వాషింగ్టన్ డీసీలో బైడెన్ క్లీన్ స్వీప్ - విజయంపై ఇద్దరు నేతల ధీమా!
బుధవారం, 4 నవంబరు 2020 (21:54 IST)
అమెరికా అధ్యక్ష పీఠం కోసం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతు చేస్తూ ప్రత్యర్థి జో బైడెన్ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు బైడెన్‌కు 238, ట్రంప్‌కు 213 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.
అనేక పెద్ద రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియా, వెర్మాంట్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డెలావేర్, రోడ్‌ఐలాండ్‌లో బైడెన్ విజయం సాధించటంతో పాటు టెక్సాస్, కాన్సాస్, మిస్సోరీలలో ముందంజలో ఉన్నారు.
ఇక ఇండియానా, ఓక్లహోమా, కెంటకీ, వర్జీనియా, సౌత్ కరోలినాలో ట్రంప్ విజయం సాధించారు. ఫ్లోరిడా, జార్జియాలలో ముందంజలో ఉన్నారు. అలాగే, అత్యంత కీలకంగా భావించే వాషింగ్టన్ డీసీలో బైడెన్ క్లీన్ స్వీప్ చేశారు. అక్కడ బైడెన్‌కు 93 శాతం పాపులర్ ఓట్లు రాగా, ట్రంప్‌కు కేవలం 5.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇకపోతే, అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న వారికి అధ్యక్ష పీఠం దక్కనుంది. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలదే కీలక పాత్ర.
ఎక్కువ ఓట్లు వచ్చినవారికే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లు వస్తాయి. కాలిఫోర్నియా-55, టెక్సాస్-38, న్యూయార్క్-29, ఫ్లోరిడా-29, పెన్సిల్వేనియా-20, ఇల్లినోయ్-20 ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలు. 10 కంటే తక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలు -30 ఉన్నాయి.
మరోవైపు, అమెరికా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అభ్యర్థులిద్దరి మధ్యా గట్టి పోటీ నడుస్తోంది. విజయంపై ఇరు పక్షాలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశాలు, ప్రకటనలు సైతం చేస్తున్నారు.
డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మీడియా ముందుకు రాకపోయినా ట్విటర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.