ఆ విమానం ఎక్కుతున్నారా... అయితే చేతిలో గొడుగు పట్టుకెళ్లండి... (Video)

ఆదివారం, 2 జులై 2017 (14:59 IST)
సాధారణంగా వర్షాకాలంలో ఇంటి పైకప్పు నుంచి వర్షపు నీరు వెలుస్తూ ఉంటుంది. ఇదే పరిస్థితి ప్రయాణం చేస్తున్న విమానంలో ఎదురైతే... భారీ మొత్తంలో సొమ్ము చెల్లించి టిక్కెట్టు కొని విమానంలో కూర్చున్నాక.. ప్రయాణంలో ఇలా చినుకుల మధ్య ఉండటం ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సరిగ్గా అమెరికాకు చెందిన ఎయిర్ లైన్స్ డెల్టా విమానంలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. 
 
అట్లాంటా నుంచి ఫ్లోరిడా వెళుతున్న విమానం పై కప్పునుంచి వర్షపు నీరు ధారంగా ప్రయాణికులపై పడసాగింది. ఆ సమయంలో వారి వద్ద గొడుగులు కూడా లేకపోవడంతో విమానంలోని ప్రయాణికులు అలా తడుస్తూనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. 
 
ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మెక్‌కాల్ఫ్ తన అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్టుచేస్తూ... తనకు షవర్ కింద ఉన్న అనుభూతి కలిగిందని పేర్కొన్నాడు. దీనిని అతని కుమారుడు కూడా షేర్‌చేస్తూ ప్రయాణికులంతా తడుస్తూనే ప్రయాణం చేస్తున్నారని కామెంట్ పెట్టాడు. కాగా విషయం తెలుసుకున్న డెల్టా సిబ్బంది... మెక్‌కాల్ఫ్‌కు పరిహారంగా 100 డాలర్ల ఓచర్‌ను అందించడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి