కాశ్మీరు సమస్య పరిష్కారానికి తృతీయ దేశం జోక్యం అవసరం లేదని భారతదేశం ఎన్నోమార్లు చెప్పింది. ఐతే తాజాగా చైనా చెప్పిన మాటలను చూస్తుంటే కాశ్మీరు సమస్యపై ప్రత్యక్షంగా జోక్యానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. దీనికి బలమైన కారణం వుందంటున్నారు. అదేమిటంటే... పాకిస్తాన్ దేశంతో చైనా తలపెట్టే చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌కు 50 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది పీవోకి ద్వారానే జరగాల్సి వుంది.
ఐతే ఇండోపాక్ మధ్య ఉద్రిక్తతలు ఇలానే వుంటే చైనా వ్యాపారానికి పెద్ద దెబ్బ. అందువల్ల ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పి తమ వ్యాపారాన్ని చక్కబెట్టుకునేందుకు కాశ్మీర్ సమస్యను పరిష్కరించే విషయంలో తను మధ్యవర్తిగా వుంటానంటూ చైనా తనకు తాను ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని అక్కడి పత్రికలు కొన్ని ఉటంకించాయి. ఐతే అధికారికంగా ఈ విషయం ధృవీకరించలేదు. మరోవైపు కాశ్మీర్ సరిహద్దు వెంట పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడుతూనే వుంది.