వివరాలు ఇలా వున్నాయి.... షికారుకు వెళ్లేందుకు భార్య ఫోన్ నుంచి ఓసారి క్యాబ్ బుక్ చేసిన పాపానికి అది విడాకులకు దారితీసిందని ఫ‍్రెంచి వ్యాపారవేత్త ఒకరులబోదిబో మంటున్నాడు. ఇందుకు కారణమైన ఉబర్ క్యాబ్ సంస్థ తనకు నష్టపరిహారంగా 40 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు 335 కోట్ల రూపాయలు) నష్టపరిహారం చెల్లించాలని దావా వేశాడు.
అప్పటినుంచి ఆ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నా.. అతడి భార్య మొబైల్స్‌కు అప్ డేట్స్ వెళ్తున్నాయి. కొన్ని రోజుల వరకు భార్య ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ బిజినెస్ పని మీద ఉండే భర్త తరచుగా కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాడని గ్రహించింది. ఉబర్ క్యాబ్ అప్లికేషన్ సాంకేతిక లోపం వల్ల భార్య తనను అనుమానిస్తోందని ఆరోపించాడు. చివరికి ఇద్దరి మధ్య అంతరం పెరిగిపోయి విడాకులు ఇచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తన పరువు పోయిందని, ఇందుకు కారణమైన ఉబెర్ సంస్థ తనకు 335 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ వ్యాపారవేత్త కోర్టుకెక్కాడు. తొలిసారి లాగిన్ డాటాతో తాను ఎక్కడ యాప్ వాడినా తన భార్య మొబైల్‌కు మెస్సేజ్ వెళ్లడమే తమ మధ్య గొడవలకు కారణమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉబర్ మాత్రం ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు.
ఉబెర్ స్పందన, ఈయన గారి ప్రతి స్పందన ఏమవుతాయన్నది తర్వాత మాట కానీ, మీరు ప్రయాణం చేయాలనుకుంటే మీ మొబైల్ నుంచి యాప్ ద్వారా బుక్ చేసుకోండి అంతేగాని ఎంత భార్య అయినా సరే ఆమె ఫోన్ జోలికి వెళ్లవద్దని, వెళ్లినా దాన్నుంచి క్యాబ్ లాంటివి బుక్ చేసుకోవద్దని ఈ ఉదంతం పాఠం చెబుతోంది కదా..