సైనిక తిరుగుబాటుతో జింబాబ్వేలో కలకలం రేగింది. అధికారాలను హస్తగతం చేసుకున్న ఆర్మీ... ఆ దేశ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను హౌస్ అరెస్ట్ చేసింది. తాము ఎలాంటి తిరుగుబాటుకు ప్రయత్నించలేదని ...అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకు పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు జింబాబ్వే మిలటరీ ప్రకటించింది.
మంగళవారం అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ప్రైవేట్ నివాసాన్ని ఆర్మీ చుట్టుముట్టడంతో సైనిక తిరుగుబాటు జరిగిందన్న వార్తలు గుప్పు మన్నాయి. ఆ ప్రాంతంలో కాల్పులు కూడా చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాబర్ట్ ముగాబేకు చెందిన జాను-పీఎఫ్ పార్టీ.. ఆర్మీ చీఫ్ జనరల్ కాన్‌స్టాంటినో చివేంగాపై తీవ్ర ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఈ సైనిక తిరుగుబాటు జరగడం గమనార్హం.
అయితే, సైనిక తిరుగుబాటు చేశామన్న వార్తలను జింబాబ్వే ఆర్మీ ఖండించింది. అధ్యక్షుడు ముగాబేపై తాము ఎలాంటి తిరుగుబాటుకు ప్రయత్నించలేదని అక్కడి అధికారిక మీడియాలో ఆర్మీ వెల్లడించింది. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే చుట్టు ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నామని తెలిపింది.
అధ్యక్షుడు ముగాబే, ఆయన కుటుంబం తమ రక్షణలో క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. క్రిమినల్స్‌ను మట్టుబెట్టిన అనంతరం దేశంలో ప్రశాంతతను పునః ప్రతిష్టిస్తామని మేజర్ జనరల్ ఎస్‌బి మోయో తెలిపారు. జింబాబ్వే 1980లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందింది. గత 37 ఏళ్లుగా జింబాబ్వేలో ముగాబే పాలన కొనసాగుతోంది. ఇటీవల 93 ఏళ్ల అధ్యక్షుడికి, సైన్యానికి మధ్య వివాదాలు ముదిరడంతో సంక్షోభానికి దారితీసింది.