అమెరికా దాడిలో ఒసామా కుమారుడి మృతి?

పాకిస్థాన్‌లో ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా జరిగిన క్షిపణి దాడిలో అల్ ఖైదా తీవ్రవాద సంస్థ అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడొకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. అమెరికా నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్‌‍పీఆర్) ఈ విషయాన్ని వెల్లడించింది.

ఒసామా మూడో కుమారుడు సాద్ బిన్ లాడెన్ పాక్‌లో ఈ ఏడాది అమెరికా డ్రోన్ (మానవరహిత విమానం) జరిపిన క్షిపణి దాడిలో మరణించాడని ఈ రేడియో స్టేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అమెరికా ప్రభుత్వం అల్ ఖైదాపై పోరు కోసం గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ భూభాగంలోనూ దాడులు చేస్తోంది.

తీవ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌ను కూడా అమెరికా భాగస్వామిని చేసింది. సాద్ బిన్ లాడెన్ డ్రోన్ దాడుల్లో మరణించివుంటాడని అమెరికా నిఘా సంస్థలు బలంగా విశ్వసిస్తున్నాయి.

ఈ విషయాన్ని 80 నుంచి 85 శాతం వరకు తాము ధృవీకరించగలమని అమెరికా తీవ్రవాద నిరోధక అధికారి ఒకరు ఈ రేడియో స్టేషన్‌తో చెప్పారు. సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ)లోని అధికారులు, అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలను ధృవీకరించలేదు.

వెబ్దునియా పై చదవండి