ఎల్టీటీఈ కొత్త చీఫ్ సెల్వరాస పద్మనాథన్

శ్రీలంకలో కొన్ని దశాబ్దాలకుపైగా ప్రత్యేక తమిళ దేశం కోసం వేలుపిళ్లై ప్రభాకరన్ నేతృత్వంలో సాయుధ పోరాటం జరిపిన ఎల్టీటీఈకి కొత్త చీఫ్‌గా ఆయుధాల స్మగ్లర్ సెల్వరాస పద్మనాథన్ ఎంపికయినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తమిళ దేశం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పద్మనాధన్ నేతృత్వంలో పనిచేయాలని టైగర్లు నిర్ణయించినట్లు సమాచారం.

రెండు నెలల క్రితం ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌ను హతమార్చడం ద్వారా శ్రీలంక సైన్యం దేశంలో అంతర్యుద్ధానికి ముగింపు పలికింది. ఎల్టీటీఈ పూర్తిగా అణిచివేసినట్లు ప్రకటించింది. ప్రభాకరన్ తన మరణానికి కొన్ని నెలల ముందు పద్మనాథన్‌ను ఎల్టీటీఈ అంతర్జాతీయ విభాగాధిపతిగా నియమించారు.

పద్మనాథన్ విదేశాల్లో ఆయుధాలు సేకరించి శ్రీలంకలో టైగర్లకు అందజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా ఎల్టీటీఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ పద్మనాథన్‌ను తమ కొత్త చీఫ్‌గా ఎంపిక చేసింది. తమిళ ప్రజల సంక్షేమం కోసం తమ స్వాతంత్ర్య పోరాటాన్ని పద్మనాథన్ ముందుకు తీసుకెళతారని ఎల్టీటీఈ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి