కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) దూరంగా ఉండాలని అమెరికా డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి ఐఎస్ఐ తన వ్యూహాలను మార్చుకోవాలని కోరింది. ఈ విషయంపై అమెరికా యంత్రాంగం పాకిస్థాన్ నాయకత్వంతో చర్చలు జరుపుతోందని ఆ దేశ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ అడ్మిరల్ మైక్ ముల్లెన్ తెలిపారు.
కాశ్మీర్‌లో తీవ్రవాద సంస్థలకు ఐఎస్ఐ మద్దతు ఇస్తోందని, అదే విధంగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని పాక్ కేంద్ర పాలిత గిరిజన ప్రాంతాల్లో (ఎఫ్ఏటీఏ)లోనూ ఐఎస్ఐ ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ముల్లెన్ వివరించారు. ఐఎస్ఐ ఈ వ్యూహాత్మక కార్యకలాపాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఖతర్‌కు చెందిన అల్ జజీరా టీవీ ఛానల్‌తో చెప్పారు.