దక్షిణ చైనాలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన జాతి ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 118 మంది గాయపడ్డారు. ఫ్యాక్టరీలో జాతి ఉద్రిక్తతలు మూడు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీశాయి. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని చైనా ప్రభుత్వ మీడియా, అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి.
షావోగాన్ నగరంలోని జురీ బొమ్మల కర్మాగారంలో వందల మంది కార్మికులు వారిలోవారే ఘర్షణలకు దిగారు. రెండు గంటలపాటు ఫ్యాక్టరీలోని మూడు జాతుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. దీంతో ఫ్యాక్టరీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సుమారు నాలుగొందల మంది పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకొని అక్కడ సాధారణ పరిస్థితులను పునరుద్ధరించారు. ఉయ్‌గుర్స్, తుర్కిక్ భాష మాట్లాడే ముస్లింలు, హాన్ చైనీస్ (చైనాలో మెజారిటీ జాతి) జాతులకు చెందిన కార్మికుల మధ్య ఉద్రిక్తతలు ఫ్యాక్టరీలో ఘర్షణలకు దారితీశాయి.