నెజాద్ తొలి ఉపాధ్యక్ష ప్రతిపాదనకు తిరస్కృతి

ఇరాన్ సుప్రీంనేత దేశాధ్యక్షుడు అహ్మదీనెజాద్ ఉపాధ్యక్ష ప్రతిపాదనను తిరస్కరించారు. ఇజ్రాయేల్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న వ్యక్తికి దేశ ఉపాధ్యక్ష పదవిని అప్పగించాలని నెజాద్ చేసిన వివాదాస్పద ప్రతిపాదనను ఇరాన్‌లో శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ తిరస్కరించినట్లు ఆ దేశ మీడియా బుధవారం వెల్లడించింది. ఈ ప్రతిపాదనను రద్దు చేసుకోవాలని గార్డియన్ కౌన్సిల్ అధిపతి అధ్యక్షుడు నెజాద్‌కు సూచించారు.

ఇరాన్ సాంప్రదాయవాద పెద్దల్లో గార్డియన్ కౌన్సిల్ నిర్ణయం చీలక తెచ్చే అవకాశం ఉన్నట్లు మీడియా పేర్కొంది. ఇరాన్ తొలి ఉపాధ్యక్ష పదవికి తన బంధువు ఎస్ఫాందీర్ రహీం మషాయ్‌ పేరును అహ్మదీనెజాద్ ప్రతిపాదించారు. రహీం మషాయ్ 2008లో వివాదాస్పద ప్రకటన ద్వారా దేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

ఇరానియన్లు ఇజ్రాయేల్‌తోపాటు, ప్రపంచంలోని అన్ని దేశాలవారికి మిత్రులేనని రహీం మషాయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం మషాయ్‌కు తొలి ఉపాధ్యక్ష పదవి దక్కకపోవడానికి ఈ వివాదాస్పద వ్యాఖ్యలే కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో పర్యాటక, సాంస్కృతిక వారసత్వ శాఖ ఇన్‌ఛార్జిగా, ఉపాధ్యక్షడిగా మషాయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే ఇటీవల ఎన్నికల తరువాత ఏర్పాటయిన కొత్త మంత్రివర్గంలో తొలి ఉపాధ్యక్ష పదవికి మషాయ్ పేరును నెజాద్ ప్రతిపాదించారు. ఇరాన్‌లో మొత్తం 12 మంది ఉపాధ్యక్షులు ఉంటారు. వీరిలో తొలి ఉపాధ్యక్షుడిగా నియమితమయ్యే వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అధ్యక్షుడు అందుబాటులో లేని సమయంలో కేబినెట్ సమావేశాలకు తొలి ఉపాధ్యక్షుడు నేతృత్వం వహిస్తారు.

వెబ్దునియా పై చదవండి