ప్రజాస్వామ్య యోధురాలు అక్వినో మృతి

ఫిలిప్పీన్స్‌లో ప్రజాస్వామ్యం నెలకొల్పడంలో సఫలీకృతురాలైన కారాజోన్ అక్వినో కన్నుమూశారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షురాలైన అక్వినో గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏడాదికిపైగా ప్రమాదకర క్యాన్సర్‌తో పోరాడిన అక్వినో శనివారం మృతి చెందారు. అక్వినో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చారు.

జూన్ నుంచి ఆమె మనీలాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దపేగు క్యాన్సర్ శరీరంలోని మిగిలిన భాగాలకు వ్యాపించడంతో అక్వినో ఆరోగ్యం జూన్‌లో బాగా క్షీణించింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అయితే శనివారం ఉదయం 3.18 గంటల సమయంలో గుండె, ఊపరితిత్తులు సమస్యలతో అక్వినో తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం ఆమె వయస్సు 76 సంవత్సరాలు. 1986లో నియంతపాలన సాగిస్తున్న మార్కోస్‌ను గద్దె దించడంలో అక్వినో కీలకపాత్ర పోషించారు. ఆమె భర్త బెనిగ్నో అక్వినో మార్కోస్ నియంతృత్వ పాలనపై పోరాడారు.

తన భర్త హత్యకు గురికావడంతో, తదనంతర కాలంలో ప్రజా ఉద్యమాల ద్వారా అక్వినో ఫిలిప్పీన్స్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్కోస్‌ను పదవీచ్యుతున్ని చేసిన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అక్వినో దేశ తొలి మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు.

వెబ్దునియా పై చదవండి