మయన్మార్ చేతుల్లోకి త్వరలో అణు బాంబు

ఉత్తర కొరియా, ఇరాక్ దేశాల వివాదాస్పద అణు కార్యక్రమాలపై సతమతమవుతున్న ప్రపంచ దేశాలకు మయన్మార్ కూడా తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నిరంకుశ మిలిటరీ జుంతా అధికారంలో ఉన్న మయన్మార్‌లో అణు బాంబు పరీక్షకు త్వరితగతిన సన్నాహాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అన్ని అనుకున్నట్లు జరిగితే మరికొన్నేళ్లలోనే మయన్మార్ తొలి అణు బాంబును పరీక్షించే అవకాశం ఉంటుంది. ఉత్తర కొరియా సహకారంతో మయన్మార్ రహస్య అణు రియాక్టర్‌ను, ఫ్లూటోనియం సేకరణ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వెల్లడించింది. ఇద్దరు ప్రధాన జుంతా ప్రతినిధులు ఈ విషయాన్ని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది.

మయన్మార్ మిలిటరీ జుంతా పర్వత గుహల్లో ఈ అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశ ఉత్తర భాగంలోని నాంగ్ లైంగ్ వద్ద నుంచి లోతైన సొరంగాలతో ఈ అణు రియాక్టర్‌ను అనుసంధానం చేశారు. దీనిద్వారా ఉపగ్రహాల నిఘా నుంచి అణు కేంద్రం తప్పించుకుంటోంది.

దేశంలోని మరొక ప్రాంతంలో రష్యా నిర్మిస్తున్న అణు రియాక్టర్‌కు సమాంతరంగా ఈ రహస్య కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వెల్లడించింది. రష్యా సహకారంతో ఏర్పాటు చేస్తున్న అణు రియాక్టర్‌ను అంతర్జాతీయ యంత్రాంగం పర్యవేక్షణలో ఉంచుతామని మయన్మార్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి