లిబియా నియంత గడాఫీ జింబాబ్వేలో దాగియున్నాడా?

మంగళవారం, 30 ఆగస్టు 2011 (13:22 IST)
లిబియా నియంత ముయమ్మార్ గడాఫీ ఎక్కడ ఉన్నాడో ఖచ్చితంగా తెలియనప్పటికీ ఒక బ్రిటీష్ మీడియా కథనం మాత్రం ఈ లిబియా నాయకుడు జింబాబ్వేలో దాగివుంటాడని పేర్కొంది. గడాఫీ గత వారం ముగాబేకు చెందిన ప్రైవేట్ విమానంలో జింబాబ్వేకు చేరుకున్నాడని యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన వార్తాపత్రిక ద డైలీ మెయిల్ పేర్కొంది. అయితే జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే‌ ప్రతినిధి జార్జ్ ఛరంబా, గడాఫీ తమ దేశంలో దాగివున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు.

ఈ బహిషృత నాయకుడికి జింబాబ్వే సురక్షిత ప్రాంతం కానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నది. గడాఫీ రాకను సులభతరం చేయటానికి గానూ గత బుధవారం రాత్రి హరారేలో విద్యుత్ కోత విధించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ముగాబే రాజకీయ ప్రత్యర్ధులు గడాఫీ తమ దేశంలోకి రావడాన్ని గుర్తించారని ద డైలీ మెయిలీ తెలిపింది. గడాఫీ జింబాబ్వే చేరుకుంటాడని అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మార్చిలోనే చెప్పగా ఈ వ్యాఖ్యలను గడాఫీ, ముగాబేలు ఖండించారు.

వెబ్దునియా పై చదవండి